జాతీయ న్యాయ సేవల దినోత్సవం

జాతీయ న్యాయ సేవల దినోత్సవం

మన దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సమానంగా న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, స్వతంత్రంగా పనిచేస్తోంది. వెనుకబడిన ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేలా, పేదలకు న్యాయ సహాయం అందించడం సహా వివిధ కార్యక్రమాలను ఇది చేపట్టింది. ఈ క్రమంలోనే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం, 1987ను తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభాన్ని గుర్తుచేసుకునేందుకు ఏటా నవంబరు 9న ‘జాతీయ న్యాయ సేవల దినోత్సవం’గా (National Legal Services Day) నిర్వహిస్తారు. ఉచిత న్యాయ సేవల లభ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పౌరులందరికీ సహేతుకమైన పద్ధతిలో న్యాయం అందేలా చూడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

దేశంలో న్యాయవ్యవస్థ

  • భారత న్యాయవ్యవస్థ ఏకీకృత, సమగ్ర, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సర్వోన్నత న్యాయవ్యవస్థ. సాధారణంగా కొన్ని సమాఖ్య ప్రభుత్వాల్లో ద్వంద్వ న్యాయవ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా అక్కడ కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరుగా న్యాయశాఖలు ఉంటాయి.
  • దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఉంటాయి. 
  • భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా పరిపాలనా కాలంలో సుప్రీంకోర్టును ప్రీవీ కౌన్సిల్‌గా పిలిచేవారు. 
  • స్వాతంత్య్రానంతరం 1950 జనవరి 28 నుంచి దిల్లీ కేంద్రంగా ఫెడరల్‌ కోర్టును సుప్రీంకోర్టుగా మార్చారు. 
  • భారతదేశంలో తొలి హైకోర్టును 1862లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 

నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా)

  • లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం, 1987 ప్రకారం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఏర్పడింది. సమాజంలోని బలహీన వర్గాలు, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం దీని లక్ష్యం. నల్సా కేసుల త్వరిత పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తుంది. 
  • సాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాతి ర్యాంక్‌లో ఉండే వ్యక్తి నల్సాకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆ స్థానంలో (2025, మే 14 నుంచి) ఉన్నారు.

ఉచిత సేవలు పొందాలంటే...

  • భారత రాజ్యాంగం సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని పేర్కొంటోంది. చట్టం ముందు అందరూ సమానమని, దాని ద్వారా అందరికీ సమాన రక్షణ దొరుకుతుందని స్పష్టం చేసింది. దీన్ని నిర్ధారించాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉంటుంది. కింది వ్యక్తులు ఈ సేవలు పొందే పరిధిలోకి వస్తారు.
  • మహిళలు, పిల్లలు
  • దివ్యాంగులు
  • ఎస్సీ, ఎస్టీ వర్గ్గాల వారు
  • పారిశ్రామిక కార్మికులు
  • నిర్బంధంలో ఉన్న వ్యక్తులు
  • ప్రకృతి వైపరీత్యాలు, జాతి/ కుల హింస, పారిశ్రామిక విపత్తు మొదలైనవాటికి గురైన బాధితులు
  • వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉన్నవారు. 


చారిత్రక నేపథ్యం

  • దేశవ్యాప్తంగా న్యాయ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు భారత పార్లమెంట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ 1987ను రూపొందించింది. 1994లో దీనికి కొన్ని సవరణలు చేశారు. 1995, నవంబరు 9న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మాజీ సీజేఐ రంగనాథ్‌ మిశ్రా దీని అమల్లో ముఖ్య భూమిక పోషించారు.
  • దీని అమలుకు గుర్తుగా ఏటా నవంబరు 9న ‘జాతీయ న్యాయ సేవల దినోత్సవం’ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్మానించింది. 

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram