స్నేహం అనేది ఒక అనిర్వచనీయ భావన.. ఇది ఎప్పటికీ శాశ్వతం. ప్రపంచంలో స్నేహితులు లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే మన మనసుకు దగ్గర కాగలిగినవారే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ముఖ్యంగా విభజనను తగ్గించి.. జాతి, మతం, సామాజిక భేదాలతో సంబంధం లేకుండా ప్రజలను ఏకం చేసే శక్తి స్నేహంలో ఉంది. నిష్కల్మషమైన స్నేహాన్ని గుర్తిస్తూ.. స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఆగస్టు మొదటి ఆదివారం నాడు ‘స్నేహితుల దినోత్సవాన్ని’ (Friendship Day) నిర్వహిస్తారు. 2025లో ఇది ఆగస్టు 3న వచ్చింది.
చారిత్రక నేపథ్యం:
• ‘ఫ్రెండ్‌షిప్ డే’ అనే భావన 1950వ దశకంలో అమెరికాలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఆగస్టులో మొదటి ఆదివారం నాడు దీన్ని నిర్వహించారు. తర్వాతి కాలంలో భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఇదే వారం ‘స్నేహితుల దినోత్సవాన్ని’ జరుపుకున్నాయి.
• ఐక్యరాజ్య సమితి 2011లో జులై 30న ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే’గా ప్రకటించింది.. అయినా మన దేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం రోజే ‘ఫ్రెండ్‌షిప్ డే’ నిర్వహిస్తారు.