ప్రపంచ నగరాల దినోత్సవం

ప్రపంచ నగరాల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 31న ‘ప్రపంచ నగరాల దినోత్సవం’గా (World Cities Day) నిర్వహిస్తారు. దేశాభివృద్ధిలో పట్టణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్థిక, రాజకీయ, పరిపాలనకు ఇవి కేంద్రాలుగా ఉన్నాయి. గ్రామాల నుంచి విద్య, ఉపాధి కోసం ఎక్కువగా వలస వెళ్తుండటంతో నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ వనరులు తగ్గి, జనాభా పెరుగుతోంది. ఫలితంగా మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, సామాజిక సేవలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది. పట్టణీకరణ వల్ల తలెత్తే సవాళ్లను పరిష్కరించడంతోపాటు స్థిరమైన నగరాల అభివృద్ధికి దోహదపడటంలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పట్టణీకరణ

  • మనిషి కనీస అవసరాల్లో ఆహారం, దుస్తుల తర్వాత ముఖ్యమైంది నివాసం. ప్రాచీన మానవుడు జంతువులు, ఇతరుల నుంచి తమని తాము రక్షించుకోవడానికి దగ్గర దగ్గరగా ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది. 
  • మెరుగైన విద్య, ఉపాధి, పరిపాలన, వైద్య సదుపాయాలు ఉన్న ఆవాసాలు చిన్న పట్టణాల నుంచి మహానగరాల స్థాయికి విస్తరించాయి. దీంతో వివిధ అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక అనుపాతంలో ప్రజలు నగరాలకు వలస బాటపట్టారు. దీన్నే పట్టణీకరణగా పేర్కొంటారు. అభివృద్ధి ప్రక్రియలో ఇది ఒక పరిణామం. పారిశ్రామికీకరణ, సాంకేతిక ప్రగతి పట్టణాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా జరుగుతుంది.
  • దీంతో గ్రామీణ జనాభాతో పోలిస్తే నగరాల్లో నివసించే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. 
  • మన దేశంలోనూ పూర్వ కాలం నుంచే పట్టణాలు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత భారత్‌లో క్రీస్తు పూర్వమే విలసిల్లిన తొలి పట్టణ నాగరికత. 

గ్లోబల్‌ లివబిలిటీ ఇండెక్స్‌ - 2025

  • ప్రజలు జీవించేందుకు అనువైన నగరాల జాబితాను 2025 జూన్‌లో ఇంగ్లండ్‌కి చెందిన ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) సంస్థ విడుదల చేసింది. గ్లోబల్‌ లివబిలిటీ ఇండెక్స్‌ - 2025 పేరుతో విడుదలైన ఈ జాబితాలో మొత్తం 173 నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.
  • స్థిరత్వం (స్టెబిలిటీ), ఆరోగ్యం, సంస్కృతి - పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్లను ప్రకటించారు. 

2025 ఇండెక్స్‌లోని టాప్‌-3 నగరాలను పరిశీలిస్తే..

ర్యాంక్‌ నగరం   దేశం   స్కోర్‌
1 కోపెన్‌హెగన్‌     డెన్మార్క్‌        98
2 వియన్నా         ఆస్ట్రియా     97.1
3 జ్యూరిచ్‌         స్విట్జర్లాండ్‌     97.1

                 
చారిత్రక నేపథ్యం

  • ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, నగరాల స్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, దాని ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి భావించింది. ఇందుకోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకుంది. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఏటా అక్టోబరు 31న ప్రపంచ నగరాల దినోత్సవాన్ని జరుపుకోవాలని 2013, డిసెంబరు 27న తీర్మానించింది. 2014 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

2025 నినాదం: People-Centred Smart Cities


 

 

 

  

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram