వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) ఆవిష్కరణకు గుర్తుగా ఏటా ఆగస్టు 1న ‘వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం’గా నిర్వహిస్తారు. వరల్డ్ వైడ్ వెబ్‌ను సంక్షిప్తంగా ‘వెబ్’ లేదా ‘డబ్ల్యూ 3’ అని పిలుస్తారు. ఇది హైపర్ మీడియా ఆధారిత సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ. దీన్ని ఉపయోగించాలంటే ఇంటర్నెట్ అవసరం. హైపర్ టెక్ట్స్, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, మల్టీమీడియాను ఏకీకృతం చేసి దాదాపు ప్రతి విషయంపై వెబ్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది సమాచారాన్ని పంచుకోవడం, వినియోగించడాన్ని సులభతరం చేస్తుంది. కమ్యూనికేషన్, ఈ-కామర్స్, వినోదం మొదలైనవాటితో సహా వివిధ ఆన్‌లైన్ కార్యకలాపాలకు వెబ్ ఒక వేదికగా ఉంది. సమాచార మార్పిడి నుంచి వాణిజ్యం వరకు వెబ్ మానవులను ఎలా ప్రభావితం చేసిందో తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (సీఈఆర్‌ఎన్)లో పనిచేసే టిమ్ బెర్నర్స్-లీ అనే శాస్త్రవేత్త 1989లో ‘వరల్డ్ వైడ్ వెబ్’ను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఇది కమ్యూనికేషన్ మాధ్యమంలా ఉండి సమాచారాన్ని పంచుకోవడం, వినియోగించడంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ఇది అన్ని వర్గాల ప్రజలను అనుసంధానిస్తూ ప్రపంచ నెట్‌వర్క్‌గా ఎదిగింది.
• 1990 చివరి నాటికి బెల్జియం సిస్టమ్స్ ఇంజినీర్ రాబర్ట్ కైలియాతో కలిసి టిమ్ బెర్నర్స్-లీ మొదటి వెబ్ సర్వర్, బ్రౌజర్‌ను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి వెబ్‌సైట్ అయిన info.cern.ch 1991, ఆగస్టు 6న లైవ్‌లోకి వచ్చింది. అందులో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ను వివరించడంతోపాటు దాన్ని ఎలా ఉపయోగించాలో సూచనలు అందించారు.