ఐక్యరాజ్యసమితి దినోత్సవం

ఐక్యరాజ్యసమితి దినోత్సవం

ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఒక అంతర్జాతీయ సంస్థ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో సంభవించే సంఘర్షణలను నివారించే లక్ష్యంతో ఇది ఏర్పడింది. ప్రపంచ శాంతి పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, వివిధ సమస్యలను శాంతియుతంగా - చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మొదలైన విషయాలపై ఐరాస ప్రధానంగా దృష్టిసారిస్తుంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా అక్టోబరు 24న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం (United Nations Day) గా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అంతర్జాతీయ సహకారం, సంఘీభావాన్ని పెంపొందించడంలో ఐరాస కృషి గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

విధులు

  1. ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు ‘అట్లాంటిక్‌ చార్టర్‌’ కారణం. దీని ప్రకారం, 
  2. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటం 
  3. మానవ హక్కుల పరిరక్షణ 
  4. మానవతా సహాయం అందించడం 
  5. అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించడం మొదలైనవి దీని విధులు.

ప్రధాన అంగాలు

ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు 6. అవి:

1. సాధారణ సభ (జనరల్‌ అసెంబ్లీ) 

2. భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్‌)

3. ఆర్థిక, సామాజిక మండలి (ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌)

4. ధర్మకర్తృత్వ మండలి (ట్రస్టీషిప్‌ కౌన్సిల్‌)

5. అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌)

6. సచివాలయం (సెక్రటేరియట్‌)

చారిత్రక నేపథ్యం:

  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్వేచ్ఛను నెలకొల్పడమే లక్ష్యంగా ‘అట్లాంటిక్‌ చార్టర్‌’ను తీసుకొచ్చారు. దీనిపై 1941, ఆగస్టు 14న అప్పటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ సంతకాలు చేశారు. 1944లో ‘డంబర్టన్‌ ఓక్స్‌’ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దేశాల ప్రతినిధులు విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ‘ఐక్యరాజ్యసమితి’ అనే అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారు. 1945, జూన్‌ 26న శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించి, సంతకాలు చేశాయి. 
  • 1945 అక్టోబరు 24న ఇది అధికారికంగా అమలై ఐక్యరాజ్య సమితి ఉనికిలోకి వచ్చింది. దీని ఏర్పాటుకు గుర్తుగా 1948 నుంచి ఏటా అక్టోబరు 24న ‘ఐక్యరాజ్యసమితి దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram