రాష్ట్రాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పరంగా దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు రూ.87లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు పోటీపడుతున్నాయి. ఇందుకు ఆయా రాష్ట్రాలకు ఉన్న అవకాశాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలపై స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ-సీఐఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది. సాంకేతికతపరంగా అధిక వృద్ధి, జీసీసీ(గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ల ఏర్పాటు, ఈవీ వాహనాల తయారీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాల విస్తరణతో ఇవి ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని పేర్కొంది.
• జీవశాస్త్రాల విస్తరణ, పర్యాటక రంగాల పరంగా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తున్నాయి. ఈ నగరాల్లో ప్రపంచస్థాయి ప్రతిభ, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో బలమైన వృద్ధి కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.
• దేశంలో ఏ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఆ దిశగా మహారాష్ట్ర ముందంజలో ఉండగా ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ పోటీపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఏ సంవత్సరంలోగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకున్నాయి.. ఏయే రంగాలను విస్తరించాలో నివేదికలో వివరించారు.