కేంద్ర బడ్జెట్‌: 2026 - 27

కేంద్ర బడ్జెట్‌: 2026 - 27

వచ్చే రాబడి, చేసే వ్యయం గురించి తెలిపే వార్షిక విత్త నివేదికే బడ్జెట్‌. ప్రభుత్వ ఆర్థిక విధాన పత్రంగా ఇది వ్యవహరిస్తుంది. బడ్జెట్‌ రూపకల్పన ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి లాంటిది. భవిష్యత్తులో ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాలు, విధివిధానాలతోపాటు ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆర్థిక వనరులు, రుణాలు, ఆర్థిక లోటు, కేటాయింపులు మొదలైనవన్నీ ఇందులోనే ఉంటాయి. బడ్జెట్‌ అనేది గణాంకాలతోపాటు ఎన్నో ప్రణాళికలు, భవిష్యత్‌ వ్యూహాల సమాహారం. ఇటీవల భారత ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో పోటీపరీక్షలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ చరిత్ర, 1947 నుంచి నేటి వరకు బడ్జెట్‌ తీరుతెన్నులు, ప్రస్తుత బడ్జెట్‌ రూపకల్పనలో పాల్గొన్న బృందం, బడ్జెట్‌ సమగ్ర స్వరూపం, రంగాలవారీ కేటాయింపులు మొదలైన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

  • బడ్జెట్‌ అనేది ఫ్రెంచ్‌ భాషలోని బొగేట్‌ (bougette) అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ‘తోలు సంచి’.భారత్‌లో బడ్జెట్‌ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత వైస్రాయ్‌ కానింగ్‌కు (1858 - 62) దక్కుతుంది. ఆయన హయాంలోనే వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిలో సర్‌ జేమ్స్‌ విల్సన్‌ 1860, ఏప్రిల్‌ 7న మొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  • మన రాజ్యాంగంలో బడ్జెట్‌ అనే పదం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112లో ‘వార్షిక విత్త ప్రకటన’ (Annual financial statement) అనే పదం ఉంది. దీని ప్రకారం ఏటా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్‌ డివిజన్‌ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు) కావాల్సిన బడ్జెట్‌ను రూపొందిస్తుంది.
  • మన దేశంలో ఇప్పటివరకు (స్వాతంత్య్రానంతరం 1947 నుంచి 2026 వరకు) 27 మంది ఆర్థిక మంత్రులుగా పనిచేశారు
  • 2019లో నిర్మలా సీతారామన్‌ ఆర్థికమంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2026  27 వరకు వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ సమర్పించారు.

2026 - 27 బడ్జెట్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2026  27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2026, ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్‌ను సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

మొత్తం బడ్జెట్‌: రూ. 53,47,315 కోట్లు

రెవెన్యూ వసూళ్లు: రూ.35,33,150 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.41,25,494 కోట్లు

మూలధన వసూళ్లు: రూ.18,14,165 కోట్లు

మూలధన వ్యయం: రూ.12,21,821 కోట్లు.

చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్‌

  • వరసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు.
  • వేర్వేరు పదవీకాలాల్లో పదిసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డుకు ఆమె చేరువయ్యారు.
  • 1959  64 మధ్య ఆరుసార్లు, 1967 69 మధ్య నాలుగుసార్లు మొరార్జీకి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లభించింది.
  • కేంద్ర మాజీ మంత్రుల్లో పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్‌ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాల్లో బడ్జెట్లు సమర్పించారు.  
  • అందువల్ల వరసగా తొమ్మిదేళ్లు, అదీ ఒకే ప్రధాని (నరేంద్ర మోదీ) హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మలదే అవుతుంది.

2026 - 27 బడ్జెట్‌ గురించి పూర్తి సమాచారం ఈబుక్‌ రూపంలో ఈనాడు ఈప్రతిభ వాట్సాప్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. వెంటనే ఫాలో చేసి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రతి రోజూ ఉచితంగా అందుకోండి. https://hov.to/e05e8f1a 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram