భారత్.. అంతర్జాతీయ హాకీ (1925-2025)లో అడుగుపెట్టి 2025 ఏడాదికి వందేళ్లు పూర్తయింది. 1925 నవంబరులో భారత హాకీకి ఓ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంత మంది వ్యక్తులు గ్వాలియర్‌లో సమావేశమయ్యారు. అలా మొదలైందే ఐహెచ్‌ఎఫ్ (ప్రస్తుతం హాకీ ఇండియా). ఐహెచ్‌ఎఫ్ 1925 నవంబరు 7న అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్).. గుర్తింపు పొందింది. మూడేళ్లలోనే అమ్‌స్టర్‌డామ్ (1928) క్రీడలు వచ్చాయి. అక్కడ భారత్ ఒలింపిక్ స్వర్ణం గెలిచింది. భారత్ ఇప్పటివరకు హాకీలో 8 స్వర్ణాలు సహా 13 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఓసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
తన ఆటతో ప్రపంచాన్ని మంత్రముగ్దుల్ని చేసిన భారత హాకీ జట్టు క్రమంగా తన ప్రమాణాలను, ప్రాభవాన్ని కోల్పోయింది. 1975లో ఎఫ్‌ఐహెచ్ ఆస్ట్రో టర్ఫ్‌ను ప్రవేశ పెట్టడం కూడా భారత్ ఆట దెబ్బతినడానికి కారణమైంది. టర్ఫ్‌లపై ఆడడానికి జట్టు త్వరగా అలవాటు పడలేకపోయింది. నిధుల లేమి కారణంగా హాకీ సమాఖ్య చాలా ఆలస్యంగా దేశంలో హాకీ టర్ఫ్‌లు ఏర్పాటు చేసింది.
వేగంగా బలహీనపడ్డ భారత జట్టు 1984 నుంచి 2016 వరకు ఒక్క ఒలింపిక్ పతకం కూడా నెగ్గలేకపోయింది. ఆ కాలంలో ఒక్కసారే గ్రూప్ దశ దాటింది. 2008లో అసలు ఒలింపిక్స్‌కే అర్హత సాధించకపోవడం భారత హాకీ చరిత్రలో ఒక మాయని మచ్చ. మరోవైపు క్రికెట్ దేశంలో క్రికెట్‌పై మోజు పెరగడంతో హాకీ మరింత నిరాదరణకు గురైంది. అయితే గత పదేళ్లలో మన హాకీ పునరుత్థానం మొదలైంది.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం (కాంస్యం) గెలిచిన భారత జట్టు.. పూర్వ వైభవం దిశగా తొలి అడుగు వేసింది. తిరిగి పారిస్ (2024) క్రీడల్లోనూ కాంస్యాన్ని గెలిచి ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు రేపింది.