దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిఘటన, ఐక్యత, గర్వానికి చిహ్నంగా నిలిచిన వందేమాతర గేయానికి 2025, నవంబరు 7న 150 ఏళ్లు నిండాయి. బ్రిటిష్ ప్రార్థనా గీతం ‘గాడ్ సేవ్ ది కింగ్’ని భారత జాతీయ గీయంగా ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. దీన్ని మెజారిటీ భారతీయ జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంగ్లేయుల చర్యకు ప్రతిస్పందనగా బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ 1875, నవంబరు 7న వందేమాతర గేయాన్ని రచించారు. సంస్కృతం, బెంగాలీ పదాలను మిళితం చేసి ఆయన దీన్ని రాశారు. ఛటోపాధ్యాయ 1882లో రచించిన ‘ఆనందమఠ్’ నవలలో దీన్ని ప్రార్థనా గేయంగా ఉపయోగించారు. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతర గేయానికి స్వయంగా బాణి కట్టి, ఆలపించారు.
నాటి బ్రిటిష్ రాజప్రతినిధి లార్డ్ కర్జన్ 1905, జులై 20న బెంగాల్‌ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ అధికారిక ప్రకటన చేశారు. 1905, అక్టోబరు 16 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశప్రజలంతా భారతమాతను స్మరించుకుంటూ ‘వందేమాతరం గేయాన్ని’ పాడారు. దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. తక్కువ కాలంలోనే ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
1950, జనవరి 24న భారత రాజ్యాంగ సభ వందేమాతరాన్ని జీతీయ గీతంగా స్వీకరించింది.