కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ పురస్కారాలను 2025, ఆగస్టు 1న దిల్లీలో ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమాకు వివిధ విభాగాల్లో ఏడు పురస్కారాలు దక్కాయి. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘హను-మాన్’ చిత్రం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ (నందు, పృథ్వీ), ఉత్తమ ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్) విభాగాల్లో పురస్కారాలు గెలుచుకోగా, ‘ఊరు పల్లెటూరు...’ (బలగం) పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌కు అవార్డు దక్కింది. యువతరాన్ని విశేషంగా అలరించిన ‘బేబి’ చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎన్‌ఎస్ రోహిత్, ఉత్తమ స్క్రీన్‌ప్లేకి గాను సాయి రాజేశ్ నీలం పురస్కారాలు దక్కించుకున్నారు. ఇక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు గెలుచుకున్నారు.
♦ ఈసారి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం షారుక్‌ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (ట్వల్త్ ఫెయిల్)లకు సంయుక్తంగా దక్కింది.