భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దాన్ని 50 శాతానికి పెంచారు. అదనంగా జరిమానా, సుంకంగా దీన్ని పేర్కొంటూ 2025, ఆగస్టు 6న కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని కారణంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ చమురు దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ కారణంగా ఆ దేశం భారత్‌కు అతి పెద్ద సరఫరాదారుగా ఉంది.
• గతంలో ప్రకటించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఆగస్టు 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియేలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30 శాతం, తుర్కియేపై 15 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి.