ఆయుర్వేదం భారతదేశ వారసత్వ సంపద. సహజసిద్ధమైన వనమూలికలు, వంటలో ఉపయోగించే దినుసులు, ప్రకృతిలో లభించే వివిధ పదార్థాల సమ్మేళనమే ఆయుర్వేదం. ఇతర వైద్య సేవలకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది. అంతేకాక అనేక అనారోగ్య సమస్యలకు ఈ సంప్రదాయ వైద్యం చక్కగా పనిచేస్తుందన్న నమ్మకం ప్రజల్లో నానాటికీ పెరుగుతోంది. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో 2025 నుంచి ఏటా సెప్టెంబరు 23న ‘ఆయుర్వేద దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మన రోజువారీ జీవితంలో ఆయుర్వేద ఉపయోగంపై అవగాహన కల్పించి, అందరూ దీన్ని ఆచరించేలా చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
మన దేశంలో ధన్వంతరిని వైద్యశాస్త్ర పితామహుడిగా, దేవతల వైద్యుడిగా పేర్కొంటారు. ఆయుర్వేదాన్ని భారత జాతికి అందించిన ఘనత కూడా ఆయనదే. అందుకే ఈయన జయంతిని ‘ఆయుర్వేద దినోత్సవం’గా జరుపుకోవాలని 2016లో కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది.
సాధారణంగా దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశి నాడు ధన్వంతరి జయంతితోపాటు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఏటా ఆ తేదీల్లో మార్పు ఉండటంతో ఈ దినోత్సవానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. దీన్ని అధిగమించేందుకు 2025 నుంచి ప్రతిసంవత్సరం నిర్దిష్టంగా సెప్టెంబరు 23న ‘ఆయుర్వేద దినోత్సవం’గా జరపాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.