అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు. ఇదొక సాంఘిక, ఆర్థిక లక్షణం. ఉపాధి లేమి, అధిక జనాభా పేదరికానికి ప్రధాన కారణాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని సమస్యలకు మూలకారణమై, అనేక ప్రభావాలకు దారితీస్తుంది. దారిద్య్రం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 17న ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం’గా (International Day For The Eradication Of Poverty) నిర్వహిస్తారు. దీనివల్ల ప్రభావితమైన వారికి సహాయసహకారాలు అందించడంతోపాటు పేదరికాన్ని రూపుమాపడానికి చేపట్టిన చర్యలపై విస్తృత ప్రచారం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఐక్యరాజ్య సమితి గణాంకాలు - చర్యలు

ప్రపంచవ్యాప్తంగా 69 కోట్లమంది ప్రజలు అల్ప తలసరి ఆదాయం కారణంగా పేదరికాన్ని అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వారు రోజుకు 2.19 డాలర్ల కంటే తక్కువ మొత్తాన్ని సంపాదిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని దాదాపు సగం మంది రోజుకు 6.85 డాలర్ల కంటే తక్కువ పొందుతున్నట్లు అంచనా. 

సుమారు 110 కోట్లమంది ప్రజలు పేదరికం కారణంగా సరైన విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను పొందలేకపోతున్నట్లు వెల్లడించింది. 

పేదరిక నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి అనేక చర్యలు చేపట్టింది. తీవ్ర పేదరికం నుంచి ప్రజలకు విముక్తి కల్పించే లక్ష్యంతో 2000, సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మిలీనియం డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపింది. 2015 నాటికి 8 సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాలని నిర్దేశించింది. అందులో మొదటిది ‘పేదరికం, ఆకలి నిర్మూలన’. 1990 నాటికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతాన్ని 2015 నాటికి సగానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించించింది. ఇది నెరవేరింది. 

భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో విజయవంతమైంది. 1990లో దేశంలో పేదరికం 47.8% ఉంది. ఇది 2015 నాటికి 23.9% కావాలి. అయితే 2011-12 నాటికే దేశ పేదరికం 21.9 శాతానికి తగ్గింది.

ఐక్యరాజ్యసమితి 2015-30 కాలానికి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది ‘పేదరికాన్ని నిర్మూలించడం’. ఇందులో 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలని పేర్కొంది.

భారతదేశంలో పేదరికం

భారతదేశంలో పేదరిక గణాంకాలను ప్రజల రోజువారీ కనీస ఆహార కొనుగోలు సామర్థ్యంపై ఆధారపడి నిర్ణయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి 2,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం, పట్టణ ప్రాంతాల్లో 2,100 కేలరీల ఆహారం పొందలేని లేదా సమకూర్చుకోలేని వారిని పేదలుగా పరిగణిస్తారు. ఈవిధంగా ప్రతి వ్యక్తికి కనీస ఆహారం అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.356, పట్టణ ప్రాంతాల్లో రూ.536 చొప్పున అవసరమని భారత ప్రణాళికా సంఘం అంచనా వేసింది. పేదరికాన్ని లెక్కించడంలో గృహనిర్మాణం, ఆరోగ్యం, రవాణా లాంటి కారణాలను కూడా పరిశీలించింది.

జాతీయ, ప్రాంతీయ స్థాయిలో దారిద్యర్రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న జనాభాను అధికారికంగా పేదలుగా గుర్తిస్తారు. బీపీఎల్‌ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం, పట్టణ ప్రాంతాల్లో 26 శాతం ఉన్నట్లు ప్రణాళికా సంఘం పేర్కొంది.

వివిధ నివేదికల అంచనాలు

భారత్‌లో అత్యంత పేదరిక (ఎక్స్‌ట్రీమ్‌ పావర్టీ) రేటు వేగంగా తగ్గి 5.3 శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్‌ 2025, జూన్‌లో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2011-12లో ఇది 27.1 శాతం కాగా, దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. రోజుకు 3 డాలర్ల (రూ.255) కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్నవారిగా ప్రపంచ బ్యాంక్‌ నిర్వచించింది. 2021లో ఈ పరిమితి 2.15 డాలర్లుగా ఉంది. సవరించిన తర్వాత 15 శాతం పెంచి 3 డాలర్లుగా చేసింది. అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నవారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. 

మనదేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గినట్లు ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక 2025, జూన్‌లో వెల్లడించింది. 2023లో దేశంలో అత్యంత పేదలు 6.35 శాతంగా ఉండగా, 2024లో 4.6 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. 

2011 జనాభా లెక్కల ప్రకారం..

భారత్‌ పేదరికం: 21.9%

అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు: కేరళ - 7.1%, హిమాచల్‌ప్రదేశ్‌ - 8.1%, పంజాబ్‌ - 8.3%, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ - 9.2%.

పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: బిహార్‌ - 33.7%, ఒడిశా - 32.6%, అస్సాం - 31.9%.

భారత్‌లో పేదల శాతం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2005లో పేదల సంఖ్య 510.4 మిలియన్ల నుంచి 2013 నాటికి 274.5 మిలియన్లకు తగ్గింది. 

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్ర పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1987, అక్టోబరు 17న పారిస్‌లోని ట్రోకాడోలో లక్ష మందికి పైగా ప్రజలతో ఒక సమావేశం జరిగింది. ఏటీడీ (ఆన్‌ టుగెదర్‌ ఇన్‌ డిగ్నిటీ) ఫోర్త్‌ వరల్డ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జోసెఫ్‌ రెసిన్స్కీఆధ్వర్యంలో ఇది జరిగింది. పేదరికం మానవ హక్కుల ఉల్లంఘనగా ఇందులో పేర్కొన్నారు. 

ఈ సమావేశం జరిగిన గుర్తుగా ఏటా అక్టోబరు 17న ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం’గా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1992, డిసెంబరు 22న తీర్మానించింది. 

2025 నినాదం: Ending social and institutional maltreatment by ensuring respect and effective support for families

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram