ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ఆరోగ్యకర జీవనంలో ‘ప్రమాణాలు’ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి, కచ్చితమైన నిర్వచనాన్ని ఇస్తాయి. మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు మొదలైనవి సురక్షితంగా, విశ్వసనీయంగా, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలంటే ప్రామాణికీకరణ అవసరం. వీటి ఆవశ్యకతను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఏటా అక్టోబరు 14న ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం’గా (World Standards Day) నిర్వహిస్తారు. వివిధ పరిశ్రమల్లో ప్రామాణీకరణను ప్రోత్సహించడంతోపాటు మెరుగైన ఉత్పత్తులు, వ్యవస్థల అభివృద్ధిలో వీటిని పాటించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా అన్ని అంశాల్లో ఒకే విధమైన ప్రామాణికీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో 1946, అక్టోబరు 14న లండన్ వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. 25 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రమాణాలను రూపొందించేలా ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఇందులో తీర్మానించారు. దీని ఫలితంగానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్‌డైజేషన్ (ఐఎస్‌ఓ)ను నెలకొల్పారు.
ఈ సమావేశాన్ని గుర్తుంచుకునేలా ఏటా అక్టోబరు 14న ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం’గా నిర్వహించాలని ఐఎస్‌ఓ, ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఈసీ), ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) భావించాయి. 1970 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.
2025 నినాదం: "Shared Vision for a Better World: Spotlight on SDG 17 – Partnerships for the Goals".