ఐఏఎఫ్ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) అనేది భారత సాయుధ దళాల వైమానిక విభాగం. దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో మన వైమానిక దళం ఎప్పుడూ ముందుంటుంది. మన దేశ వైమానిక పరిధిని భద్రంగా చూసుకోవడం, శత్రు దేశాలతో సంఘర్షణ పరిస్థితులు తలెత్తినప్పుడు యుద్ధంలో పాల్గొనడం దీని బాధ్యత. క్లిష్టమైన భూభాగాలు, వాతావరణాల్లో భారత సైన్యానికి ఎయిర్ లిఫ్ట్ మద్దతు, లాజిస్టిక్స్ సరఫరాతోపాటు విపత్తుల సమయంలో సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలోనూ ఇది కీలకంగా పనిచేస్తుంది. మన దేశ వైమానిక దళం ఏర్పాటుకి గుర్తుగా ఏటా అక్టోబరు 8న ‘భారత వైమానిక దళ దినోత్సవం’గా నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీకి భారత వాయుదళం అందించిన సహకారం, వాయుసేన వివిధ యుద్ధాల్లో చూపిన పోరాట పటిమ గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1932 అక్టోబరు 8న రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఆఫ్ బ్రిటన్‌కు సహాయక విభాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను స్థాపించారు. 1933 ఏప్రిల్ 1న నాలుగు వెస్ట్‌లాండ్ వాపిటి విమానాలతో కూడిన మొదటి స్క్వాడ్రన్ ప్రారంభమయ్యాక ఇది ఉనికిలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాలో జపాన్ వారిని నిలువరించడంలో ఐఏఎఫ్ కీలకంగా వ్యవహరించింది. భారత వాయుదళ పోరాట పటిమను చూసి బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ బిరుదుతో సత్కరించి రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌గా పేరు మార్చింది. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు రాయల్ అనే పదాన్ని తొలగించారు.