విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించుకునేందుకు ఏటా అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని (World Teachers’ Day) నిర్వహిస్తారు. దీన్నే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (International Teachers Day) అని కూడా అంటారు. దేశ భవిష్యత్తు యువతరంపైనే ఆధారపడి ఉంటుంది. వారు సక్రమంగా ఉంటేనే సమాజం అన్ని విధాలా ముందుకు సాగుతుంది. వారిలో సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు, దేశం పట్ల భక్తిభావం, సమాజం - పెద్దల పట్ల గౌరవం, అంకితభావాలను పెంపొందించడంలో గురువు కీలకపాత్ర పోషిస్తారు. తరగతి గదిలో వారు తమ శిష్యులకు చదువుతోపాటు విలువలు, జ్ఞానంతో కూడిన జీవిత నైపుణ్యాలను బోధిస్తారు. భవిష్యత్తు తరాలను అభివృద్ధి చేయడంలో ఉపాధ్యాయుల కృషిని గుర్తించడంతోపాటు ఆ వృత్తి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల స్థితిగతులను తెలుసుకునే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), యునెస్కో 1966, అక్టోబరు 5న పారిస్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించాయి. అందులో టీచర్ల హక్కులు, బాధ్యతలకు సంబంధించి వివిధ ప్రమాణాలను నిర్దేశించారు. అన్ని దేశాలూ వీటిని అనుసరించాయి.
ఈ సమావేశానికి గుర్తుగా ఏటా అక్టోబరు 5న ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకోవాలని 1994లో యునెస్కో తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
ఈ రోజును ఐఎల్‌ఓ, యునెస్కో, ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ (ఈఐ) సంయుక్త భాగస్వామ్యంతో జరుపుతున్నారు.
మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏటా సెప్టెంబరు 5న నిర్వహిస్తారు.
2025 నినాదం: “Recasting teaching as a collaborative profession”