భారత్‌ ముఖ్య భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ కూటములు

అలీనోద్యమ (నామ్‌) కూటమి మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలోచనలతో 1961లో ఏర్పడింది. తొలి సమావేశం యుగోస్లేవియాలో జరిగింది. ఇందులో ప్రస్తుతం 120 దేశాలు ఉన్నాయి. సమావేశాలు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతాయి.

జీ-4 దేశాల కూటమి 2004లో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లు కలిసి జీ-4 దేశాల కూటమిగా ఏర్పడ్డాయి.

ఐబీఎస్‌ఏ కూటమి ఇండియా (I), బ్రెజిల్‌ (B), దక్షిణాఫ్రికా (SA)లు సభ్యులుగా ఉన్న ఐబీఎస్‌ఏ 2003లో ఏర్పడింది. 2006లో ఈ కూటమి తొలి శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లో జరిగింది. భారత్‌లో ఇప్పటివరకు రెండుసార్లు (2008, 2015లో) ఈ సమావేశాలు జరిగాయి.

బ్రిక్స్‌ కూటమి 2008లో ఏర్పడింది. సభ్యదేశాలు: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. మొదటి సమావేశం 2009లో రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో జరిగింది. ఈ కూటమి ఏర్పడటానికి రష్యా ప్రస్తుత అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాన కారకుడు.

సార్క్‌ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్‌) 1985, డిసెంబరు 8న ప్రారంభమైంది. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్‌లకు సభ్యత్వం ఉంది. సార్క్‌ మొదటి సదస్సు 1985లో ఢాకాలో జరిగింది.

కామన్వెల్త్‌ దేశాధినేతల కూటమి 1931లో ‘లండన్‌’ కేంద్రంగా ఏర్పడింది. 1947లో భారత్, పాకిస్థాన్‌లు; 1948లో శ్రీలంక ఈ కూటమిలో చేరాయి. దీనికి బ్రిటిష్‌ రాజు/ రాణి అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి దీని సమావేశాలు జరుగుతాయి. ప్రస్తుతం ఇందులో 54 సభ్యదేశాలు ఉన్నాయి.

షాంఘై సహకార సమాఖ్య (SCO) 1996లో ఏర్ప‌డింది. ఆసియా ఖండంలో ఏర్పడిన ప్రాంతీయ భద్రతా గ్రూప్‌గా పేరొందింది. భార‌త్ సహా ఇందులో 8 స‌భ్య‌దేశాలు ఉన్నాయి.